BRS కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ ఆనంద్ భాస్కర్

On
BRS కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ ఆనంద్ భాస్కర్

BRS కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ ఆనంద్ భాస్కర్

న్యూఢిల్లీ మే 04: 

మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామ చేశారు. ఆయనతో పాటు చేరిన మెదక్ జిల్లా సీనియర్ నాయకులు మహమ్మద్ మొహియిద్దీన్, వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజక వర్గ నాయకులు, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులు తీగల లక్ష్మణ్ గౌడ్ పార్టీ నుంచి దూరమవుతున్నారు.

ఆనంద్ భాస్కర్ రాజీనామా పూర్తిపాఠం:

తెలంగాణ రథ సారథి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి నాయకత్వంలోని ప్రాంతీయ ఉద్యమ పార్టీ లో 2022 అక్టోబర్ ఆఖరు నుంచి కేవలం గడపలోకి అడుగు పెట్టి, వేచి ఉన్నట్లు సాగిన అనుబంధాన్ని నేటి నుంచి నేను తుంచుకుంటున్నాను. నన్ను చాలా మర్యాదగా స్వాగతించి, తన అక్కున చేర్చుకుని, ఆప్యాయంగా చూసుకున్న శ్రీ కేసిఆర్ గారికి, నిరంతరం ఎంతో గౌరవప్రదంగా నన్ను సంభోదిస్తూ ఉండే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ తారక రామారావు గారికి, అన్నా అనే పదం వీడకుండా, అనాదిగా ఆదరణ చూపే శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి, అందులోని మిగతా పెద్దలు, మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

నాతో పాటు చేరిన మెదక్ జిల్లా సీనియర్ నాయకులు శ్రీ మహమ్మద్ మొహియిద్దీన్, వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజక వర్గ నాయకులు, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులు శ్రీ తీగల లక్ష్మణ్ గౌడ్ పార్టీ నుంచి దూరమవుతున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కీలక దశలో ఉద్యమ, రాజకీయ పార్టీగా ప్రత్యేక భూమిక సాధించి, తొమ్మిదేళ్ళు తనదైన శైలితో అనేక విజయాలతో పాలన సాగించిన శ్రీ కేసిఆర్ గారికి తన శక్తి, తన లోపం పూర్తిగా తెలుసు. దూరమవుతూ దూషించడం నా తీరు కాదు, నా వల్ల కాదు. నిర్మాణ శైలి, వ్యవహార శైలి గమనించి పార్టీ కార్యకలాపాల లో వీలయినంత నేను దూరమే ఉన్నాను. గత అసెంబ్లీ ఎన్నికలలో మునుగోడు నియోజక వర్గ పరిధిలో సమన్వయ పాత్ర వినా, నా సేవలు వారికి అవసరం కాలేదు. సేనలు, శ్రేణులు వారికి నిండుగా ఉన్నాయి. అన్ని రకాల ప్రణాళికలు, వ్యూహాలు వారి వద్ద ఉండే ఉంటాయి. వారికి నాలాంటి వారి అవసరం మున్ముందు కూడా ఉంటుందని నాకు అనిపించలేదు. అందుకే కేవలం నేను ప్రవేశిస్తున్నప్పుడు కప్పిన వారి గులాబీ కండువను హైదరాబాద్ లోని వారి తెలంగాణ భవన్ కు వినమ్రంగా పోస్టు ద్వారా తిరిగి పంపిస్తున్నాను.

నా భవిష్యత్ కార్యాచరణ:

రాజకీయ, సామాజిక కార్యకర్తగా, తెలంగాణ సాధనలో నేను నిర్వహించిన పాత్రకు అనుగుణంగా, నా రాష్ట్ర భవిష్యత్తు కోసం నాదైన ఉడుతాభక్తి పాత్ర నేను నిర్వర్తిస్తూనే ఉన్నా, సదా నిర్వర్తిస్తూనే ఉంటాను. శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రోత్సాహంతో వారి హయాంలో దేశవ్యాప్త జనాభా గణనలో కుల జన గణన జరిగింది. కానీ దానిని మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం సాంకేతిక లోపాలు చూపుతూ, ప్రకటించ లేకపోయారు. తర్వాత అప్పటి అధికార పార్టీలోనే ఉండి, ప్రధానిని తన పుట్టినరోజు కానుకగా కుల జన గణన చేపట్టమని 2021 ఆగస్టులోనే బహిరంగ లేఖ ద్వారా నేను చేసిన అభ్యర్ధన కలిగించిన సంచలనం నేడు చైతన్యంగా మారింది. జాతీయ యువ సంచలనం శ్రీ రాహుల్ గాంధీ గారు గొంత్తెత్తడంతో, సార్వత్రిక ఎన్నికలలో రణనినాదమై, జాతీయ స్థాయి ఆకాంక్షగా ప్రభావం చూపుతున్నది. తెలంగాణ రాష్ట్రం మొదటి నుంచి ఈ అంశంలో ముందున్నది. శ్రీ కేసిఆర్ గారి హయాంలో సకల జనుల సర్వే అదే. కానీ చేప్పుకోలేక పోయారు. తాజాగా అధికార మార్పిడి జరిగిన వెంటనే, శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రశంసనీయంగా తెలంగాణ రాష్ట్ర పరిధిలో కుల జన గణనకు కార్యాచరణ చేపట్టింది. వెనుకబడిన బలహీన వర్గాల ఆకాంక్షల సాధన కోసం, ఇలాంటి సామాజిక భద్రత, సామాజిక న్యాయ ఉద్యమాలలో నాదైన పాత్ర పోషిస్తాను. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం గా కొల్లగొట్టాలని, తెలంగాణ అభివృద్ధి ని అడ్డగించాలని ఓర్వలేని వారి మబ్బులు ముసురుకుంటున్నాయి. తెలంగాణ భౌగోళిక స్వరూపం, ప్రగతి రక్షణ కోసం ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు, నా చేనేత సామాజికవర్గ ఉపాధి సమస్యల సాధన కోసం నిరంతరం కృషి చేస్తాను. అందుకోసం తెలంగాణ సబ్బండ వర్గాల సకల జనుల ఆశీర్వాదం నేను కోరుకుంటున్నాను.

Tags