మతసామరస్యానికి ప్రతీక దామెర ఫకిర్ షా వలి జాతర

అధిక సంఖ్యలో హాజరవుతున్న హిందువులు

On
మతసామరస్యానికి ప్రతీక దామెర ఫకిర్ షా వలి జాతర

తరతరాలుగా ఆచరిస్తున్న సాంప్రదాయం

ఎల్కతుర్తి ఏప్రిల్ 09 (ప్రజామంటలు) 

(కందుకూరి రాజన్న ప్రజామంటలు ప్రతినిధి ప్రత్యేక కథనం)

 

దామెరలో ఫకీర్‌షావలీ జాతర ప్రతి యేటా ఉగాది పండుగ రోజు ఘనంగా నిర్వహిస్తారు. గ్రామంలోని గుట్టపై వెలసిన ఫకీర్‌షావలీని స్మరిస్తూ ప్రతి ఉగాది రోజున హిందూ, ముస్లింలు కలిసి ఉరుసు (జాతర ) ఘనంగా నిర్వహిస్తారు. దాదాపు నూట యాబై ఏళ్ల క్రితం నిజాం పాలకులు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న కాలంలో, ప్రస్తుత వరంగల్ జిల్లా ఆత్మకూరు వద్ద సైనిక పటాలాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో సయ్యద్ హజ్రత్ ఫకిర్ షావలీ అనే యూనాని వైద్యుడు ఉండేవారు. ఆయన ఎక్కడ పనిచేసినా సమీప ప్రాంతాలను సందర్శించి, పేద రోగులకు చికిత్స చేయడం అలవాటు. ఈ క్రమంలో ఓసారి దామెరకు వచ్చాడు. అప్పటికి దామెరతో పాటు చుట్టూ ఉన్న గ్రామాల్లో గత్తర (కలరా), ప్లేగు లాంటి వ్యాధులు వ్యాపించడం వల్ల నిత్యం పదుల సంఖ్యలో జనాలు మరణిస్తుండేవారు. ఈ పరిస్థితి చూసి చలించిన ఆయన ప్రజల ఆరోగ్యవంతులయ్యే వరకు దామెర పరిసర ప్రాంతాలలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఫకీర్ తన సొమ్మును సైతం పేద ప్రజల కోసం వెచ్చించాడు. ఈ చర్యలతో ఫకీర్ ప్రజల గుండెల్లో దైవమై నిలిచాడు. వయసు మీద పడడంతో ఫకీర్ అతివృద్ద్యాప్య దశకు చేరుకున్నాడు. ఫకీర్ గ్రామ పెద్దలను పిలిచి తాను ఉగాది పర్వదినాన మరణిస్తానని, నా శవాన్ని మంచంపై వేసుకుని ఇస్లాం మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తే చాలని చెప్పారు. దీంతో ముస్లిం సంప్రదాయం తెలియని గ్రామస్థులు ఇతర ప్రాంతం నుంచి లాల్‌మహ్మద్ అనే ముజావర్ (ఇస్లాంసంప్రదాయాలు తెలిసిన వ్యక్తి) ని తీసుకొచ్చారు (ప్రస్తుతం గ్రామంలో ఉన్న ముస్లింలంతా ముజావర్ సంబంధీకులే కావడం విశేషం) ఫకీర్ మరణం తర్వాత మంచంపై మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేసరికి మంచంలోని శవం అదృశ్యమైందని, అదే రోజు రాత్రి కొందరికి ఫకీర్ కలలో తాను ఎక్కడికి పోలేదని గ్రామ సమీపంలోని రాతి గుట్టపైనే ఉన్నానని చెప్పాడట. మర్నాడు గ్రామస్తులంతా గుట్టపైకి వెళ్లీ చూసేసరికి ఫకీర్ సమాధి సాక్షాత్కరించిందట. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతియేటా ఉగాది పండుగ రోజు ఫకీర్‌షావలీ జాతర నిర్వహిస్తు న్నారు. ఫకీరషావలీని దర్శించుకుంటే దీర్ఘకాలిక రోగాలు నయమవడంతో పాటు, సంతానం లేని వారికి పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. కష్టమైనప్పటికి వయోభేదం లేకుండా గుట్టపైకెక్కి ఫకీర్‌షావలీ సమాధిని దర్శించుకుంటారు. గుట్టపైకి వెళ్లిన తర్వాత వేసవిలో సైతం చల్లని గాలులు వీచడం విశేషం. ఎల్కతుర్తి మండలంతో పాటు భీమదేవరపల్లి, హుజూరాబాద్, ధర్మసాగర్, హసన్‌పర్తి, హన్మకొండ మండలాల నుంచి 20వేల మంది భక్తులు వస్తారు.ఎల్కతుర్తి మండలకేంద్రం నుంచి జాతర జరిగే దామెర గ్రామం మూడు కిలో మీటర్ల దూరంలోనే ఉంటుంది. కరీంనగర్, వరంగల్, సిద్దిపేటలను కలిపే ప్రధాన రహదారులపైనే ఎల్కతుర్తి ఉం టుంది. ఇక్కడ దిగి ఆటోలో దామెరకు చే రుకోవచ్చు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ నుంచి కూడా రవాణా మార్గం ఉంది.

Tags