సనాతన సంస్కృతి సంప్రదాయాలే ధర్మాన్ని నిలబెడతాయి - నంబి వేణుగోపాల ఆచార్య

On
సనాతన సంస్కృతి సంప్రదాయాలే ధర్మాన్ని నిలబెడతాయి - నంబి వేణుగోపాల ఆచార్య

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల ఏప్రిల్ 13 (ప్రజా మంటలు)

కట్టుబొట్టు సనాతన సంస్కృతి సంప్రదాయాలే ధర్మాన్ని నిలబెడతాయి అని నంబి వేణుగోపాల ఆచార్య అన్నారు.

శనివారం రాత్రి పొద్దు పోయిన తర్వాత జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార సమితి మన గుడి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శ్రీ రామాయణ సప్తాహం కార్యక్రమంలో భాగంగా ఆయన భక్తులను ఉద్దేశించి ప్రవచనం చేశారు. ప్రాశ్చాత్య సంస్కృతులు మనపై పూర్తిస్థాయిలో ఆవహించాయని కానీ సనాతన ధర్మం చాలా గొప్పదని దానిని అభివర్ణిస్తూ రాముడు ఒకే మాట ఒకే బాణం అన్న నానుడికి కట్టుబడి ఉండి పితృ వాక్య పరిపాలనకై నిరంతరం కృషి చేశాడని అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడైనాడని తెలిపారు.

రామో విగ్రహ వాన్ ధర్మః అన్నట్లు ధర్మానికి ప్రమాణం శ్రీరామచంద్రుడని ఆయనే భూమిపై సాకార రూపునిగా అవతరించి అటు మానవ ధర్మాన్ని ఇటు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడని రాముని చరిత్రను ఉటంకిస్తూ పలు దృష్ట్యాంతాలను వివరించారు.

సమకాలిన పరిస్థితుల్లో సామాజిక మార్పులు ప్రాశ్చాత్య పోకడలతో సమాజం ఏ విధంగా మార్పులు చెందిందో కళ్ళకు కట్టినట్లు ఉదాహరణలతో తెలియజేశారు. సనాతన సంస్కృతి సాంప్రదాయాలను తల్లిదండ్రులు తమ తదుపరి తరాలకు పరిచయం చేయాల్సిన బాధ్యత పెద్దలుగా మనపై ఉందని ధర్మబద్ధమైన జీవితాన్ని ఆచరించి మనిషి సన్మార్గంలో నడిచినట్లైతే శాంతియుత జీవనాన్ని పొందగలుగుతారని పేర్కొన్నారు.

భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమానంతరం సామూహికంగా భగవనామస్మరణ చేస్తూ మంగళ హారతి, మంత్రపుష్పం కొనసాగించారు.

కాగా ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి. నాగభూషణం, బండ శంకర్, రేపల్లె హరికృష్ణ తదితరులు పాల్గొని ఆచార్యుల వారి చేతుల మీదుగా ఆశీర్వచనం, ప్రసాదం పొందారు.

Tags