గతించిన మనిషి - గుర్తుకొస్తున్న జ్ఞాపకాలు- అజాత శత్రువు నిజాం వెంకటేశం
అలిశెట్టి ప్రభాకర్‌తో విడదీయలేని వెంకటేశం అనుబంధం....
సాహితీవేత్తలకు దిక్సూచి - కొత్తవారికి సద్దిమూట
ఐదు దశాబ్దాల సాహిత్యకారుల చెరగని బంధం
తెలంగాణ సాహిత్యం చరిత్రలోనీ ప్రత్యేక వ్యక్తిత్వం
అనువాద సాహిత్యంలో చెరగని ముద్ర
( చిత్రం, రచన: మహమ్మద్ గౌస్)
సుమారు అర్ధ శతాబ్దం పాటు మూడు తరాల రచయితలకు వారధిగా నిలిచిన తెలంగాణకు చెందిన కవి, అనువాదకుడు, ప్రచురణకర్త. వర్థమాన కవులను ఎంతగానో ప్రోత్సహించడమే కాకుండా పలు ప్రసిద్ధ రచనలకు తెలుగు అనువాదం కూడా చేసిన సాహితీవేత్తల ఆత్మీయుడు, పుస్తక ప్రేమికుడు మరియు
నడిచే పుస్తకం నిజాం వెంకటేశం గారి వర్ధంతి జ్ఞాపకం !
నిజాం వెంకటేశం గారు ఎంతో మంది కవులకు దారి చూపారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో కవితా సంకలనాలను, పుస్తకాలను అనువదించారు. సుమారు 6 దశాబ్దాలుగా సాహిత్యంలోనే జీవిస్తూ, అదే శ్వాసిస్తూ అనేక ప్రముఖ గ్రంథాలను ప్రచురించారు. తెలంగాణలో కవిత్వాభిలాషను పెంపొందించేందుకు 1989 దశకంలో ‘దిక్సూచి’ కవిత్వ పక్ష పత్రికను తీసుకొచ్చారు. ప్రముఖ కవులు అలిశెట్టి ప్రభాకర్, సుద్దాల అశోక్ తేజ వంటి వారిని తొలినాళ్లలో వెంకటేశం ప్రోత్సహించారని రచయిత పత్తిపాక మోహన్ గుర్తుచేసుకున్నారు. న్యాయవాది విద్యాసాగర్ రెడ్డి ఆర్థికశాస్త్ర అంశాలపై ఆంగ్లంలో రాసిన పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. సుభాష్ పాలేకర్ వ్యవసాయ పద్ధతి మీదా వెంకటేశం పుస్తకం రాశారు. ప్రసిద్ధ రచయిత అల్లం రాజయ్య ‘మనసు లోపల విధ్వంసం’ తదితర కథలను ఆంగ్లంలోకి అనువదించారు. ఇవిగాక తెలంగాణ భాషాశాస్త్ర పరిశోధకుడు నలిమెల భాస్కర్, ప్రముఖ కవి జూకంటి జగన్నాథం తదితరుల కథలు, కవిత్వాన్ని సంపుటాలుగా తీసుకొచ్చారు. సాహితీకారులకు నిత్యం చేదోడు వాదోడుగా ఉండేవారు నిజాం వెంకటేశం గారు.
......
వెంకటేశం గారు 1948, నవంబరు 14వ తేదీన విశ్వనాథం - సత్యమ్మదంపతులకు తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో జన్మించాడు. ఇద్దరు సంతానంలో వెంకటేశం పెద్దవాడు. ఇతనికి ఒక చెల్లెలు ఉంది. వీరికి సిరిసిల్ల పట్టణంలో జనరల్, కిరాణా షాపు ఉండేది. మూడున్నర సంవత్సరాలకే ఇంటిపక్కనున్న పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించాడు. సంవత్సరంన్నరకాలంలోనే మూడు తరగతులు చదవడం పూర్తిచేశాడు. సాహితీవేత్తల పరిచయంతో సాహిత్యంపై ఆసక్తి కలిగింది. హైస్కూలో చదువులోనే అన్ని మాధ్యమాలలో ఫస్ట్ మార్కులతో పాసవ్వడంతోపాటు అన్నీ కవిత్వ వక్తృత్వపోటీల్లో చురుకుగాపాల్గొనేవాడు.
డాక్టర్ కోర్సు చేయడానికి తమ ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో పాలిటెక్నీక్ కోర్సులో ఎలెక్ట్రికల్ ఇంజనీర్ డిప్లమా చేసి, చెన్నైలో ఏఎంఐఈ చదివాడు.
......
1968లో జగిత్యాలలోని ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటులో ఎన్ఏంఆర్ (తాత్కాకాలిక ఉద్యోగి) గా నెలకు 96/- రూపాయలు వేతనంతో చేరాడు. ఆ తరువాత పర్మినెంట్ పోస్టింగ్ వచ్చింది. అందులో 29 సంవత్సరాలపాటు పనిచేసి అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ హోదాలో 1997 సంవత్సరంలో స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకుని హైదరాబాదులోని పద్మరావు నగర్ లో స్థిరపడ్డాడు.
• 'బిజిలీ కే సాబ్' అని గుర్తింపు....
ఎలెక్ట్రికల్ రంగంలో వెంకటేశం అనుభవాన్ని గుర్తించిన ఎలక్ట్రిక్ కంపెనీల ఆహ్వానం మేరకు తెలంగాణ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో పనిచేశాడు. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో 320 కోట్ల ప్రాజెక్టులో ప్రముఖ పాత్ర పోషించాడు. ఇందులో 22 నెలల్లో 30 వేల ఎలెక్ట్రికల్ పోల్స్ వేసి, 40 వేల కనెక్షన్లు ఇప్పించాడు. ఆ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రశంసలు పొందడంతోపాటు 'బిజిలీ కే సాబ్' అని గుర్తింపు తెచ్చుకున్నాడు.
• సాహిత్యరంగంలో ఎనలేని సేవ
చెన్నైలో చదివుతున్నప్పుడు విశ్వవిద్యాలయంలో కవిత్వపోటీలో పాల్గొని రెండవ బహుమతిగా 10 పుస్తకాలను అందుకున్నాడు. అలా సాహిత్యంపై ఏర్పడిన ప్రేమతో మహాత్ముల జీవిత చరిత్రలు, వివిధ రకాల పుస్తకాలు చదివాడు. అలిశెట్టి ప్రభాకర్, సుద్ధాల అశోక్ తేజ వంటి సాహితీవేత్తలను ప్రోత్సహించాడు. లాయర్ విద్యాసాగర్ రెడ్డి రాసిన పలు పుస్తకాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోని అనువాదం చేశాడు. ప్రముఖ ప్రకృతి వ్యవసాయదారుడు సుభాష్ పాలేకర్ వ్యవసాయంలో అనుసరించే పద్దతులపై కూడా పుస్తకం రాశాడు. 80వ దశకంలో ‘దిక్సూచి’ అనే కవితా పత్రికను ప్రారంభించి ఎంతోమంది కొత్త, పాత కవులకు వేదికగా నిలిచాడు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో కవితా సంకలనాలను, పుస్తకాలను అనువదించాడు. అల్లం రాజయ్య కథల సంకలనం ‘భూమి’ని ముద్రించాడు. పువురి కథలు, కవిత్వాన్ని సంపుటాలుగా తీసుకొచ్చాడు. తన ఇంట్లో 1000 పుస్తకాలతో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు
చేయడంతోపాటు, తార్నాక ప్రాంతంలో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని 3.50 లక్షల ఖర్చుపెట్టి ఉచిత గ్రంథాలయాన్ని నడిపారు.
• అలిశెట్టి ప్రభాకర్‌తో వెంకటేశం అనుబంధం....
అలిశెట్టి ప్రభాకర్‌తో వెంకటేశం అనుబంధం విశేషమైనది. పెద్దన్నలా ప్రభాకర్‌ను సరిదిద్దేందుకు ఎంతో ప్రయత్నించారు. 1988లో ప్రభాకర్‌ను జగిత్యాలకు రప్పించి ఆయన ఆరోగ్య, కుటుంబ బాధ్యతలను తనపై వేసుకున్నారు. అయితే ‘సిటీలైఫ్’ ఆగిపోతుందని ఓ కాగితం ముక్క రాసిపెట్టి అలిశెట్టి తిరిగి హైదరాబాదుకు వచ్చేశాడు. జేబు ఖాళీగా ఉన్నా అలిశెట్టి ఒకరి సొమ్మును ఆశించేవాడు కాదు. తన భావజాలానికి విరుద్ధంగా ఉన్నవారిని పూర్తిగా దూరం పెట్టేవాడు. అయితే వెంకటేశం చేసే ఆర్థిక సాయానికి మాత్రం ప్రభాకర్ అడ్డు చెప్పేవాడు కాదు. దానిని ప్రస్తావిస్తూ అలిశెట్టి ఓ కవితలో:
‘ఘల్లున గచ్చుమీద రూపాయి బిళ్ళ మోగినట్లు నిజాం వెంకటేశం వస్తాడు
నన్నూ నా రోగాన్ని మందుల్నీ కవిత్వాన్నీ కవుల్నీ తిట్టినా తిట్టు తిట్టకుండా
కసితీరా తిట్టి మధ్యలో రూటు మార్చి మహాశ్వేతాదేవిని మెచ్చుకొని
తరచుగా సాహిత్య సభల్లో
పాల్గొన లేనందుకు నొచ్చుకొని
నాకో వందిచ్చుకొని మరి నిష్క్రమిస్తాడు’ అని రాసుకున్నాడు. 2013లో అలిశెట్టి ప్రభాకర్ కవితా సంపుటి రావడంలోను వెంకటేశం ప్రధానపాత్ర పోషించారు.
• అన్నలకే ‘పెద్దన్న’.. నిజాం వెంకటేశం...
మావోయిస్టు అగ్రనేతలకు ఆత్మీయుడు నిజాం వెంకటేశం. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని మావో యిస్టు అగ్రనేతలు ఆయన మరణించేదాకాబయటపెట్టలేదు.
సిరిసిల్ల పట్టణానికి చెందిన నిజాం వెంకటేశం(74) గతేడాది సెప్టెంబరు 18న హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణించిన విషయం తెలిసి..సరిగ్గా పది రోజులకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ ఓ వ్యాసం రాశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల రాసిన వ్యాసం ఏడాది కిందట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎవరీ నిజాం వెంకటేశం.. ఏమిటీ ఆయన చరిత్ర అని ఆరా తీశారు. ‘అవును వెంకటేశం సార్ ఇక్కడే ఉండేవారు. ఇక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత తిరిగి పెద్దపెల్లికి రాలేదు’ అంటూ 42 ఏళ్ల క్రితం తనతో ఉన్న అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఐదారేళ్లు పెద్దపల్లిలోనే ఉద్యోగం చేశారు. కరెంటు పవర్ హౌస్ (రాఘవపూర్ సబ్ స్టేషన్) లో ఉద్యోగం చేస్తూ ఓ సాహితీవేత్తగా విప్లవానికి అందించాల్సిన సేవలు అందించారు. ఆయన విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూనే.. గుట్టలు సమీపంలో ఉండడంతో పెద్దపల్లిలో ఐటీఐ చదివే వారు, విప్లవకారులు ఆయన ఇంటిని షెల్టర్‌గా చేసుకున్నారు.ఆయన మూలాలు పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఉన్నాయని తెలుసుకున్న పలువురు సాహితీవేత్తలు ఉద్వేగానికి గురయ్యారు. సమసమాజ స్థాపనకు జరుగుతున్న ప్రజా యుద్ధంలో తన వంతు శక్తికి మించి సాయాన్ని అందించారని నిజాం వెంకటేశం నిజాల గురించి మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రాసిన వ్యాసంతో వెల్లడైంది.
......
కుటుంబ సభ్యులు కూడా వారికి భోజనం పెట్టి ఆత్మీయంగా ఉండేవారని మల్లోజుల తన వ్యాసంలో వెల్లడించారు. తన కంటే ముందు తన సోదరుడు మల్లోజుల కోటేశ్వర్‌రావుకు వెంకటేశం అత్యంత సన్నిహితుడని వివరించారు. తనను సైకిల్‌పై కూర్చోబెట్టుకుని డబుల్ సవారీ చేస్తూ తనకు ప్రపంచాన్ని పరిచయం చేశాడని వేణుగోపాల్ చెప్పడం విశేషం.
• అగ్రనేతలకు ఆత్మీయుడు....
పశ్చిమబెంగాల్‌లో అమరుడైన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ మొదలుకొని కేంద్ర కమిటీలో ఉన్న గణపతి అలియాస్ ముప్పళ్ల లక్ష్మణ్‌రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి (కోసా), మంథనికి చెందిన మల్లా రాజిరెడ్డి, ప్రభుత్వంతో శాంతి చర్చల ప్రతినిధి గణేష్ ఇలా.. ఓ పదిపదిహేను మంది మావోయిస్ట్ అగ్రనేతలకు నిజాం వెంకటేశం సార్ ఇల్లు ప్రధాన షెల్టర్ అని రాఘవపూర్ గ్రామస్తులు తెలిపారు. వామ్మో సార్ ఇంటికి అప్పట్లో పెద్ద పెద్దోళ్లు (పెద్దన్నలు) వచ్చేవారని అంటున్నారు. ఇక ఉత్తర తెలంగాణ కార్యదర్శి సాగర్ అలియాస్ దుగ్గు రాజ లింగం ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు.
......
రాజలింగంకు నిజాం వెంకటేశం అత్యంత సన్నిహితుడిగా మల్లోజుల వేణుగోపాల్ పేర్కొన్నారు. నిజాం వెంకటేశం విప్లవ కార్యాచరణకు అందించిన సహకారాన్ని వివరిస్తూ రాసిన లేఖ పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల్లో ఒక సంచలనం రేపింది. విప్లవ ఉద్యమానికి ఆయన నిర్వర్తించిన పాత్ర అనిర్వచనమని మల్లోజుల పేర్కొన్నారు. ఆశ్రయం కల్పించడం, సాహిత్యాన్ని అందించడం, వచ్చినవారిని కడుపులో దాచుకోవడం, ఉద్యమంలో పాల్గొన్నవారిని, వారి ఆర్థిక అవసరాలను తీర్చి, ప్రోత్సహించేవారిని నాటి వెంకటేశం మిత్రులు పేర్కొంటున్నారు.
......
ఇలా ఉద్యమానికి అక్షరమై, ఆయుధాన్ని అందించిన వెంకటేశం సిరిసిల్ల ప్రాంత వాసి కావడం విశేషం. నిజానికి నిజాం వెంకటేశం గురించి సిరిసిల్ల ప్రాంత వాసులకు చాలా తక్కువే తెలుసు కానీ, ఆయనతో సన్నిహితంగా ఉండేవారికి అపర మేధావి, ధైర్యవంతుడు, పెద్ద యుద్ధానికి అగ్రనేతలను సంసిద్ధులను చేసిన పెద్దన్నగా పేరు సంపాదించినట్లు తెలిసింది.
• హైదరాబాద్‌లో స్థిరపడి....
సిరిసిల్లకు చెందిన నిజాం విశ్వనాథం, సత్తమ్మ దంపతుల కొడుకు వెంకటేశం. భార్య పేరు మాధవి. ఒక్క కొడుకు, ఇద్దరు కూతుర్లు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 1966లో పాలిటెక్నిక్ చేసిన వెంకటేశం, చదువు పూర్తికాగానే 1968లో తొలిసారి ట్రాన్స్‌కోలో ఉద్యోగిగా జగిత్యాలలో విధుల్లో చేరారు. 1972 నుంచి 1978 వరకు పెద్దపల్లిలో పని చేశారు. అనంతరం 1978 నుంచి 1990 వరకు జగిత్యాల ప్రాంతంలో పని చేశారు. 1997లో ఉద్యోగ విరమణ చేశారు. ఇంగ్లిష్‌పై పట్టున్న ఆయన అనేక పుస్తకాలను తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. సిరిసిల్ల శివారులోని రంగినేని ట్రస్ట్‌లో జరిగే సాహిత్య వేడుకలకు ఆయన తరచూ వచ్చేవారు. సిరిసిల్లలో అనేక మంది కవులు, సాహిత్యకారులు నిజాం వెంకటేశం సన్నిహితులుగా ఉన్నారు. కవిగా, విమర్శకులుగా పలు సాహిత్యకార్యక్రమాల్లో పాల్గొన్నారు.
• అజాత శత్రువు’గా పుస్తకం.....
వెంకటేశం సాహిత్యం.. వ్యక్తిత్వాన్ని ‘అజాత శత్రువు నిజాం వెంకటేశం’ పేరుతో పుస్తకాన్ని వెలువరించారు. తెలంగాణ జిల్లాలోని ప్రముఖ రచయితలు, కవులు, సాహిత్యకారులు ఈ పుస్తకంలో ఆయనతో ఉన్న అనుబంధాలను రాశారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఆయన ఎదుటివారికి సాయం చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేవారు కాదు. తన సంపాదనలో ఎక్కువగా పుస్తకాల కొనుగోలుకు వెచ్చించినట్లు పలువురు తమ వ్యాసాల్లో వెల్లడించడం విశేషం. తను మరణించిన ఏడాది పూర్తి అయిన సందర్భంగా సిరిసిల్ల ప్రాంతంలోని సాహిత్యకారులు ఆయన సేవలను యాది చేసుకున్నారు.
• మరణం...
వెంకటేశం సికింద్రాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ 2022, సెప్టెంబరు 18న గుండెపోటుతో మరణించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సూర్య గ్లోబల్ పాఠశాలలో గో విజ్ఞాన పరీక్షలు

దుర్గా నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి ఒక సంవత్సరం జైలు శిక్ష,1000/ రూపాయలు జరిమాన

హోం గార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

బ్యాంకులు, ఎటిఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి: డీఎస్పీ రఘు చందర్

చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడి అరెస్ట్
.jpg)
గతించిన మనిషి - గుర్తుకొస్తున్న జ్ఞాపకాలు- అజాత శత్రువు నిజాం వెంకటేశం

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో ప్రతిభ కనబరిచిన సహస్ర

ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షునితో చాంద్ పాషా భేటీ

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

ప్రజలు కష్టాల్లో ఉంటే చేయాల్సింది సాయం...రాజకీయం కాదు..

గాంధీలో ఈఎన్ టీ వైద్యుల రాష్ట్రస్థాయి మహా సదస్సు
-(1).jpg)