గంజాయి కొనుగోలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
పరారీలో విక్రేత
ఎల్కతుర్తి 01 నవంబర్ (ప్రజామంటలు) : గంజాయి కొనుగోలు చేస్తున్న ఓ యువకుడిని ఎల్కతుర్తి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పులి రమేష్ వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. ఎల్కతుర్తి ఎస్సై గోదరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఎల్కతుర్తి మండలం గుంటూర్ పల్లి క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం వెహికల్ చెక్ చేస్తుండగా, రోడ్డు పక్కన కారు, బైక్ పై ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారి వద్దకు వెళ్లగా, కారులో ఉన్న ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన రొడ్డబోయిన శ్రీధర్ అనే వ్యక్తి పారిపోయాడు. బైక్ పై ఉన్న యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. అతడిని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లికి చెందిన ఇరువాల అన్వేష్ (22) గా గుర్తించారు. అతడి వద్ద తనిఖీ చేయగా, 100 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. కారులో తనిఖీ చేయగా 100 గ్రాముల గంజాయి కనిపించింది. శ్రీధర్ నుండి గంజాయి కొనుగోలు చేసి రోజూ సేవిస్తున్నట్లు అన్వేష్ అనే వ్యక్తి వెల్లడించాడు. కారు, బైక్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అన్వేష్ ను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. గంజాయి విక్రయిస్తున్న దామెర గ్రామానికి చెందిన రొడ్డబోయిన శ్రీధర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గంజాయి కొనుగోలు చేస్తున్న యువకుడిని చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై గోదరి రాజ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ సారంగపాణి, కానిస్టేబుల్ తిరుపతిని సీఐ అభినందించారు. సమావేశంలో కానిస్టేబుల్ బక్కయ్య, రాజు, నిరంజన్, రంజిత్, వలీ, స్వరూప పాల్గొన్నారు.