అఘోర పాశుపత రుద్ర హోమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
భీమదేవరపల్లి ఆగస్టు 20 (ప్రజామంటలు) :
ప్రసిద్ధిగాంచిన కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో శ్రావణ మాస మంగళవారం రోజును పురస్కరించుకొని శ్రీ వీరభద్ర నక్షత్ర దీక్షల సందర్భంగా, అఘోర రుద్ర హోమాన్ని ఆలయ ప్రాంగణంలో కన్నుల పండుగగా నిర్వహించారు.
ఈ హోమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గణపతి పూజతో ప్రారంభించి, వర్ధిని శివ కుంభంలో ఆవాహన చేసి ఆవరణ దేవతార్చన, కుంభ సంస్కారం, లక్ష్మీ గణపతి హోమం, మూల మంత్రాలు, ఆవరణ హోమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అఘోర పాశుపత రుద్ర హోమం, పంచ సూక్త హోమాలు నిర్వహించి, మహా పూర్ణాహుతి, అగ్ని ఉద్వాసన నిర్వహించారు.
స్వామివారికి కుంబాభిషేకం, బిల్వపత్రంలచే లక్ష బిల్వార్చన, మహా మంగళహారతి నిర్వహించారు. అఘోర పాశుపత రుద్ర హోమం నిర్వహించడం వలన లోక కళ్యాణం జరిగి సకాల వర్షములతో సస్యరక్షణ జరుగునని పండితులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కిషన్ రావు, ఉప ప్రధానార్చకులు రాజయ్య, ముఖ్య అర్చకులు రాంబాబు, అర్చకులు శ్రీకాంత్, రమేష్, వినయ్ శర్మ, సందీప్ కుమార్, వీరభద్రయ్య, శరత్ చంద్ర శివకుమార్, శ్రావణ్, గురు ప్రసాద్, సిబ్బంది రవీందర్, నారాయణరావు, రాజేందర్, బిక్షపతి, రాజు, నక్షత్ర దీక్షా స్వాములు, భక్తులు పాల్గొన్నారు.