తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు
సౌకర్యాలు కల్పించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. - ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జిల్లా, జూన్ 02 (ప్రజా మంటలు):
రాష్ట్ర రాజధాని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు
జగిత్యాల జిల్లా నుండి ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సమయ స్ఫూర్తితో స్పందించి జిల్లాలోని ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను గుర్తించి హైదారాబాద్ లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. వారికి తగిన ఏర్పాట్లు, వసతులు కల్పించారు.
జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజక వర్గాలకు వేర్వేరుగా బస్సులను, కార్లను, ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖర్చులతోనే రవాణా సౌకర్యం కల్పించారు. అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర, పరిపాలనాధికారి పుప్పాల హన్మంతరావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు లు ఎప్పటి కప్పుడు ఏర్పాట్లను, రవాణా విషయాలను సందాన కర్తల ద్వారా తెలుసుంకుంటూ ఎలాంటి లోటు - పాట్లు జరుగకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ప్రతి బస్సులో సందాన కర్తలను, సహాయకులను, ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించి సేవలు అందించారు. ఉద్యమ కారులకు, అమరవీరుల కుటుంబాలకు అల్పాహారం, భోజన సౌకర్యాలు, త్రాగు నీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఉద్యమ కారులు సి.హెచ్.వి.ప్రభాకర్ రావు, చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్ శర్మ, కంతి మోహన్ రెడ్డి ల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాలతో పాటు పట్టణాల, గ్రామాల నుండి సుమారు రెండు వందల మందికి పైగా ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను
రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలించారు.
కొందరు ఉద్యమకారులు వారంతట వారే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకొని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలి వెళ్లారు. ధర్మపురి లోని తహశీల్దార్ కార్యాలయం నుండి, జగిత్యాల లోని ఆర్డీవో కార్యాలయం నుండి, మెట్ పల్లి ఆర్డీవో కార్యాలయాల నుండి ఆదివారం ఉదయత్ పూర్వం 3-00 గంటలకు వాహనాల్లో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లారు.
ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు
ఆరు దశాబ్దాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనంతరం ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలన తర్వాత నూతన ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం రావడం ఆనందంగా ఉందని ఉద్యమ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ కారులను గుర్తించి వేడుకలకు ఆహ్వానం పలికిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి, ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కు, అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర కు, ఇతర అధికారులకు, సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ కారులకు ఇచ్చిన ఇదే గుర్తింపును ఎప్పటికీ కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉద్యమ ఆకాంక్షలను, అమరవీరుల ఆశయాలను నెరవేర్చాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజక వర్గాల తో పాటు వివిధ మండలాల నుండి, పట్టణాల నుండి సుమారు 200 మందికి పైగా ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లినట్లు వారు వివరించారు.