పి సి సి అధ్యక్షులుగా మహేష్ కుమార్

On
 పి సి సి అధ్యక్షులుగా మహేష్ కుమార్

తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షులుగా. మహేష్ కుమార్ గౌడ్

హైదారాబాద్ సెప్టెంబర్.06: తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది.

గత 8 నెలలుగా కొత్త పీసీసీ అధ్యక్షుని నియామకం కొరకు జరిగిన చర్చల్లో చివరికి మహేష్ కుమార్ గౌడ్ వైపే ఏఐసీసీ మొగ్గింది. 

 ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌కు కొత్త పీసీసీ అధ్య‌క్షుడిని నియ‌మించేందుకు కాంగ్రెస్ పార్టీకి 9 నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది.

మ‌హేశ్ కుమార్ గౌడ్ రాజ‌కీయ నేప‌థ్యం..

బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్‌ జిల్లాలోని భీంగల్ మండలం, రహత్‌ నగర్‌లో జ‌న్మించారు. గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. మహేష్ కుమార్ గౌడ్ గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు. ఆ తరువాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మహేష్ కుమార్ 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశాడు.

మహేష్ కుమార్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్య ర్థిగా పోటీ చేసి ఓట‌మి చ‌విచూశారు. ఆ తరువాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. మహేష్ కుమార్ 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా నియమితుల‌య్యారు.

2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీ-పీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితుల‌య్యారు. మహేష్ కుమార్ గౌడ్ 2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన ఆ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా నిలపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవికి ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ ఏడాది జనవరి 31న తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు మహేశ్ కుమార్ గౌడ్

గతంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గా పనిచేసిన మధు యాష్కీ. ఈ పదవి కొరకు చివరి వరకు పోటీలో అన్నారు. కానీ ఆయన గత శాసన సభ ఎన్నికల్లో ఎల్ బి నగర్ నియోజక వర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారని, ఓడిన వారికి పదవి ఇస్తే, ఇంకా చాల మంది ఇతర పదవులకు పోటీపడతారని, అందుకే పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది, మధు యాష్కీ కి ఇతర చోట స్థానం కల్పించి అవకాశం ఉందని చెప్పుకొంటున్నారు.

Tags