"ట్రావెల్ బ్యాన్" బాధితుడికి అండగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

- దుబాయిలో మోసాల ముఠా ఉచ్చులో చిక్కిన జగిత్యాల వాసి.

On

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల మే19 ( ప్రజా మంటలు ) : 

 

ఉపాధికోసం దుబాయి వెళ్లిన రాజేష్ అనే వ్యక్తి అక్కడి బ్యాంక్ మోసాలకు పాల్పడే ముఠా ఉచ్చులో చిక్కి పోలీసులు స్వంత గ్రామానికి రాకుండా (ట్రావెల్ బ్యాన్) ప్రయాణ నిషేధం విధించగా కుటుంబం ఆందోళన చెందుతోంది.

ఈ విషయాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి ఎలాగైనా రక్షించాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు.

ఈ విషయాన్ని జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే తగిన సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్, ఢిల్లీలో గల విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయానికి ఈనెల18 న వైర్ లెస్ మెస్సేజ్ పంపించి రాజేష్ కుటుంబానికి జీవన్ రెడ్డి అండగా నిలిచారు.

కుటుంబ సభ్యులకథనం ప్రకారం...

జగిత్యాల పట్టణం కటికెవాడకు చెందిన గొల్లపెల్లి రాజేష్ (39) అనే యువకుడు బతుకుదెరువు కోసం గత డిసెంబర్ లో ఆజాద్ వీసాపై దుబాయికి వెళ్ళాడు.

ఎంప్లాయిమెంట్ వీసా ఉన్నప్పటికీ, సరైన ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఒక ముఠా మోసపూరిత మాటలు నమ్మి అక్కడ కేసులో ఇరుక్కుపోయారని తెలిపారు.

బ్యాంకుల ద్వారా అప్పు తీసుకుని ఏదైనా బిజినెస్ చేయొచ్చని ఒక ముఠా రాజేష్ ను నమ్మించి అతనితో 6 బ్యాంకుల్లో ఖాతాలను తీయించి డెబిట్ కార్డులు, చెక్ బుక్కులు తీసుకున్నారని తెలిపారు.

అయితే రాజేష్ బ్యాంకు ఖాతాలు అనుమానాస్పద0గా ఉన్నాయని దర్యాప్తు కోసం దుబాయిలోని ఆల్ బరసహ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు పూర్తయ్యేవరకు దుబాయి దాటి వెళ్లకుండా రాజేష్ పై 'ట్రావెల్ బ్యాన్' (ప్రయాణ నిషేధం) విధించారని కుటుంబ సభ్యులు వివరించారు.

దుబాయిలో బ్యాంకు మోసాల ముఠా ఉచ్చులో చిక్కిన రాజేష్ ను రక్షించాలని అతని కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకోగా కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇస్తూనే రక్షించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

Tags