చిన్న హనుమాన్ జయంతికి సకల సౌకర్యాలు కలిగించాలి

- అదనపు కలెక్టర్ దివాకర.

On
చిన్న హనుమాన్ జయంతికి సకల సౌకర్యాలు కలిగించాలి

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

కొండగట్టు ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు )

కొండగట్టు శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవములకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర అన్నారు.

మంగళ వారం రోజున కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవముల ఏర్పట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ దివాకర మాట్లాడుతూ......

ఈ నెల 22 నుండి 24 వ తేదీ వరకు కొండగట్టులో శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను సకాలంలో సమన్వయంతో నిర్వహించాలని అన్నారు.

ముఖ్యంగా వేసవి కాలం దృష్ట్యా త్రాగునీటి సరఫరాలో అధిక ప్రాధాన్యత కల్పించాలని, అందుకు ఎక్కువ మొత్తంలో చలివేంద్రాలను భక్తులు వెళ్ళే దారుల వెంబడి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వాహనాలలో వచ్చే భక్తుల సౌకర్యంకు 7 వాహన పార్కింగ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు, ఆయా ప్రాంతాలలో నీడ ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తూ త్రాగునీటి వసతి కల్పించాలని, రాత్రి వేళ్ళలో లైటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. ముఖ్యంగా దీక్షలో ఉన్న భక్తులు కాలి నడకన వచ్చే వారికి ఉపశమనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

భక్తుల మాల ధారణ తీసివేయడం, కేశ ఖండన ప్రాంతాలు, కోనేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. 3 కేశ ఖండన ప్రాంతాలు, 125 షవర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

50 సిసి టివీలతో పాటు మరో 50 అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు 50 చలివేంద్రాలను దేవాలయ ప్రాంగణం, సరిహద్దు, కాలి నడకన వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 6 మెడికల్ క్యాంపులను, 2 అంబులెన్సులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నిరంతర పారిశుద్ధ్యం నిర్వహించడానికి 380 మంది పారిశుద్ధ్య పనివారిని నియమిస్తున్నామని తెలిపారు. కోనేరులోని నీటినీ శుభ్రపరచాలని తెలిపారు. పోలీస్ కంట్రోల్ రూం, మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

వివిధ ప్రాంతాల నుండి రాత్రి వేళల్లో కాలి నడకన వచ్చే భక్తులకు ముందస్తు జాగ్రత్తలో భాగంగా రేడియం స్టిక్కర్లను అందించడం జరుగుతుందని తెలిపారు. అత్యవసర సమయాల్లో వినియోగించుకోవడానికి 2 అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

పారిశుధ్య పనులకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి నేతృత్వంలో విధులు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.

కార్యక్రమాల నిర్వహణ బాధ్యత జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి, డిప్యూటి సి.ఈ.ఓ.ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, భక్తులు ప్రసాదం కొనుగోలుకు ఎక్కువ మొత్తంలో కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జగిత్యాల ఆర్దిఒ పి. మధుసూధన్, డిఎస్పీ రఘు చందర్, ఆలయ ఈ.ఓ. ఏ. చంద్ర శేఖర్, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి. శ్రీధర్, జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు, ఆయా మండల తహశీల్దార్లు, ఎంపిడిఓలు, జిల్లా, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags