పాన్ కా షాన్... చీపురిశెట్టి నర్సన్న. - పాన్ నివాళి.

ఎప్పటికీ మర్చిపోలేని యాదితో నర్సన్నకు ధర్మపురి తాంబూల ప్రియులు.

On
పాన్ కా షాన్... చీపురిశెట్టి నర్సన్న. - పాన్ నివాళి.

రాతగాడు : రమణ కొంటికర్ల... ✍️

ప్రజా మంటలు ప్రతినిధి: సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

ధర్మపురి జూన్ 16 (ప్రజా మంటలు) :

ప్రాంతాలకతీతంగా భక్తుల కొంగుబంగారం ధర్మపురి లక్ష్మీనర్సన్న...

కానీ, ఆ ప్రాంతంలోని వారికి పాన్ బంగారం చీపిరిశెట్టి నర్సన్న!

ధర్మపురి తాంబూల ప్రియుల కల్పతరువు నర్సన్నకు ఘన నివాళులతో.. ఎప్పటికీ మర్చిపోలేని యాదితో!

పుక్కిట్లో పాన్ పెట్టుకుని బజార్లో ఎవరైనా కనిపిస్తే చాలు.. నర్సన్న దర్శనం చేసుకుని వచ్చినట్టు ఓ లెక్క!

వక్కపలుకులో సురపానమే వేస్తాడో.. ఆర్కే సోంప్ లో అమృతమే దాస్తాడో... ఒక్కసారి తిన్నవాడికి అలవాటుగా.. అలవాటైనవారికి అటువైపు లాగేదిగా.. కిళ్లీ కొట్టుకు సైతం ఇసుక స్తంభమంత హైట్ ఆపాదించాడు.

ప్రతీ మనిషీ ఎదుగుదలకూ ఓ పరిధి, పరిమితి, ఎక్కడో ఓ చోట ఫుల్ స్టాప్ ఉండి తీరుతుంది. కానీ, ఎదుగుదలలో తామెంచుకున్న రంగంలో వారెక్కడుంటే అక్కడ తమ ముద్ర వేసుకోవడమే లెజెండ్స్ లక్షణమైతే... ధర్మపురి ప్రాంతంలో తన పాన్ పరాగంతో ముద్ర వేసుకున్న లెజెండ్ చీపిరిశెట్టి నర్సన్న!

మనుషుల పేర్లే గుర్తుండి చావని రోజులు. కలిసి చాలారోజులైతే తెలిసిన పేర్లు కూడా మర్చిపోయే రోజులు. కానీ, మా నర్సన్నకు పేరు చెబితే చాలు.. వారి పానేంటో తెలిసేది. అలా ఎలా అని మనం ఆశ్చర్యపోయేంతలో పాన్ రెడీ అయి మన చేతుల్లో ఉండేది.

నర్సన్న పాన్ కట్టే స్పీడ్... ఒట్టు! ఇవాల్టి రోబోలు కూడా అందుకోలేవు!!

నాకు ఊహ తెలిసినప్పటి నుంచే సుమారు నాల్గున్నర దశాబ్దాలుగా నాల్గు తరాలకు పాన్ అంటే చీపిరిశెట్టి నర్సన్ననే.

ఉదయమే వచ్చి ఓ సంచీలో 20 పాన్లు తీసుకెళ్లేటాయన ఒకరు... వచ్చినప్పుడల్లా రెండేసి కట్టించుకుని వెళ్లేవారు మరొకరు... మిట్టమధ్యాహ్నం రెండున్నర తర్వాత కూడా పాన్ దొరకాలంటే నర్సన్న షాపుకు వెళ్లు, దొరుకుతుందని చెప్పేవారు మరొకరు.. రాత్రి పది దాటినా పాన్ తినాలనిపిస్తే ఓ ఫోన్ కొట్టి పోయేవారు ఇంకొకరు... ఇదిగో ఒక ఊరు ఊరు మొత్తానికి పాన్ టేలా నర్సన్నతో ముడిపడ్డ ఈ బంధం కేవలం ఆయన కట్టిన కిళ్లీవల్లే కాదు.. ఆయన మాటల కలుపుగోలుతనమూ అందుకు కారణం!

తింటే, గారెలే తినాలి.. వింటే, భారతమే వినాలని ఎలా ఐతే చెప్పుకుంటామో..

తింటే నర్సన్న పానే తినాలి.. లేదంటే పానే మానేయాలి.. ఇదీ ఆయన దగ్గర కిళ్లీ అలవాటైనవారి గల్లీ గల్లీ ముచ్చట!

నర్సన్న పాన్ తిన్నాక ఇంకెక్కడా పాన్ తినలేరు. అదే నర్సన్న మనకు పాన్ తో పాటు ఇచ్చే బోనస్ అడ్వంటేజ్! లేకపోతే, ఆ నర్సన్న పాన్ మత్తు, మజా అలవాటు ఎక్కడపడితే అక్కడ దొరికితే.. పర ఊర్లో ఉండేటోళ్లు ఉద్యోగ జీవితాల్లోనూ జంధ్యాల సినిమాల తరహాలో పుక్కిట్లో పాన్లతోనే కనిపించేవారు కాదు..?

అందుకే, నర్సన్న పాన్ దొరకని చోట దాని జోలికే పోనోళ్లంతా.. పండుగలు, సెలవులు ఆసన్నమైతే ఊళ్ళో మాత్రం ఆటవిడుపుగా పుక్కిట కిళ్లీలతో గుబాళించేవారు. అరుగుల మీద నీది ఆర్కే సోంపా అంటే.. నీది ఆర్కే బాబానా ముచ్చట్లతో అలా సాగిపోయిన రోజులవి.

నర్సన్న కాస్త మూడీ! ఎప్పుడెలా ఉంటాడో.. ఎవరితో ఎలా బిహేవ్ చేస్తాడో ఒక్కోసారి అనేది ఆయన మీదుండే చిన్న ఫిర్యాదు!!

అంతేకాదు, అప్పుడప్పుడు మనం అనుకున్న స్థాయిలో పాన్ ఉండకపోతే.. నర్సన్న భాగం వక్కలు బాగా మెయింటైన్ చేస్తలేడు.. కాబట్టి మార్చేద్దామనుకున్న వారికి.. కాస్త పక్కకు వెళ్లాక.. ఇంకోచోట పాన్ తిన్నాక తెలిసేది.. ఎందుకు నర్సన్న పాన్ కు మాత్రమే అలవాటయ్యామనేది!

అందుకే చిన్న కోపం తెచ్చుకున్నంత దూరం కూడా పాటించకుండా.. మళ్లీ నర్సన్న పాన్ టేలా దగ్గరే తచ్చార్లాడటమంటే.. ఆయన పాన్ ఎంత మాయ చేసి ఉంటుంది..?

ఇంటింటికీ ఓ పాన్ దాన్... ధర్మపురి వంటి అగ్రహారాల్లో సర్వసాధారణం. 

అలా కుటుంబాలకు కిళ్లీతో... బ్రాహ్మల భోజనాలనంతరం తాంబూలాలతో విడదీయలేని అనుబంధం. 

అలాంటి చోట పాన్ దానే బంద్ చేసి... విడదీయలేని అవినావభావ సంబంధమయ్యాడు పాన్ టేలా నర్సయ్య.

కొందరు అద్భుతాలు సాధించొచ్చు... ఐనా, కొంతకాలమే గుర్తుండొచ్చు. కానీ, కొందరు హృదయానికి, జీవితానికి దగ్గరయ్యే పనులు చేసి.. కలకాలం గుర్తుంటారు. అదిగో ముష్ఠాన్న భోజనం చేశాక పాన్ వేసుకుందామనుకునే ధర్మపురియన్స్ కు అలా తప్పకుండా ఎప్పటికీ మొదట గుర్తొచ్చే పేరు పాన్ టేలా నర్సయ్య... బయటెక్కడైనా పాన్ వేసుకున్నాక.. గతంలో నర్సన్న పాన్ తిని ఉన్నోళ్లకు ఆ పోలిక గుర్తుచేసుకునే క్రమంలో జ్ఞప్తికి వచ్చేది పాన్ టేలా నర్సయ్య.

అందుకే పాన్ ఉన్నంత కాలం... పాన్ తిన్నంత కాలం.. ధర్మపురి పుర ప్రజల యాది పాన్ టేలా నర్సన్న!

అప్పుడప్పుడూ ఊరికెళ్లినప్పుడు పాన్ టేలా నర్సన్నతో ఉన్న బంధంతో... ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ...

ధర్మపురి తాంబూల ప్రియులు......

Tags