ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి
ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి
ధర్మపురి సెప్టెంబర్ 02 (ప్రజా మంటలు -రామ కిష్టయ్య సంగన భట్ల) :
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, గోదావరి నది గణనీయంగా పెరిగింది. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడం చేత, నది ఎగువ ప్రాంతాల నుండి నదిలో క్రమేపి వరద నీరు చేరుతున్న కారణంగా గోదావరి నీటిమట్టంలో గంటగంటకూ, మార్పు చోటు చేసుకుంటున్నది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోనికి భారీగా చేరిన ఇన్ ఫ్లో గణనీయంగా పెరగగా, తదనుగుణంగా ఇన్ ఫ్లో బట్టి అవుట్ ఫ్లో కొన సాగిస్తున్నారు. కడెం నుండి 700 అడుగుల గరిష్ఠ స్థాయికి గాను, సోమవారం ఉదయం 3గంటలకు 696 అడుగుల ఎత్తుకు నీటిని స్థిరంగా ఉండేలా క్రమానుగతంగా18గేట్లను ఎత్తడం ద్వారా గరిష్టంగా 2,77,78 క్యూసెక్కుల నీటిని ఉదయం నుండి వదిలారు. కడెం వరద నీటిని గోదావరి నది లోనికి వదలడంతో, సదరు నీరు ధర్మపురికి క్రమానుగతంగా చేరి, నీటి మట్టం అనుక్షణం పెరిగింది.
ఉదయం నడి ఒడ్డున గల శ్రీ సంతోషి మాతా ఆలయం ప్రధాన ఉత్తర ద్వారం దాటి వరదలు పైకి చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ఎప్పటి కప్పుడు నీటి ఉధృతి సమాచారాన్ని అందుకుంటూ అధికారులను అప్రమత్తం చేశారు. సాయంత్రం ధర్మపురిలోని మంగలి గడ్డ వద్దకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేరుకొని గోదావరిని పరిశీలించి తగు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అధికారులతో సమన్యాయం కలిగి ఎప్పటి కప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ధర్మపురి తహశీల్దార్ కృష్ణ చైతన్య, సీఐ రాం నర్సింహా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, ఎస్ ఐ, తమ సిబ్బందిని సమన్వయ పరిచే విధంగా ఉపక్రమించి, అనుక్షణం సమాచారాన్ని ప్రాజెక్టుల అధికారుల ద్వారా తెలుసుకుని, ఉన్నతా ధికారులకు సమాచారం అందిస్తూ, గోదావరి నది ఒడ్డున మకాం వేసి, దేవస్థానం పక్షాన మైకులలో ప్రకటింప చేస్తూ, తీరవాసులను అప్రమత్తం చేసే చర్యలు గైకొన్నారు. రెవెన్యూ అధికారులు గోదావరి తీరాన గల సంతోషి మాత ఆలయం లోనికి నీరు చేరగా, భక్తుల స్నానాలను నిలిపి వేసి, నది ప్రవాహం వద్దకు ఎవరినీ వెళ్లనీయ కుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. కడెం ప్రాజెక్టు నుండి వదులున్న నీటిని క్రమంగా తగ్గించిన క్రమంలో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అలాగే శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుండి అదే క్రమంలో అధిక వరద నీటిని గోదావరి లోనికి వదిలారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు శ్రీరా సాగర్ ప్రాజెక్టుకు భారీగా చేరిన ఇన్ ఫ్లో బట్టి 1091 అడుగుల ఎత్తుకు గాను 1088.5 అడుగుల ఎత్తును సరిచూసుకుని, ఉదయం 11.40కి 1లక్ష క్యూసెక్కుల నీటిని వదిలి క్రమేపీ సాయంత్రం 5గంటలకు 40 గేట్ల ద్వారా 2లక్షల నుండి గరిష్టంగా 2,50,000 క్యూసెక్కుల నీటిని గోదావరి లోనికి వదిలారు. రాత్రి వరకు సదరు నీరు ధర్మపురి క్షేత్రం ప్రాంతానికి చేరుకొనున్నందున అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.